అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి: 50 ఏళ్ల తర్వాత తొలి కొత్త ఆయిల్ రిఫైనరీ.. ట్రంప్ సంచలన ప్రకటన!

  • టెక్సాస్‌లో రూ. 25 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టు
  • భారత దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
  • అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంగా అభివర్ణన
  • వేలాది మందికి ఉపాధి.. ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యం
అమెరికా ఇంధన రంగంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా, అమెరికాలో మొట్టమొదటి కొత్త ఆయిల్ రిఫైనరీని నిర్మిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లే పోర్ట్ వద్ద నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ 'రిలయన్స్ ఇండస్ట్రీస్' భాగస్వామిగా ఉండటం విశేషం.

ఈ ప్రాజెక్టు విలువ సుమారు 300 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 25 లక్షల కోట్లు). ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డీల్ అని ట్రంప్ అభివర్ణించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. "భారతదేశంలోని మా భాగస్వాములకు, అక్కడి అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ రిలయన్స్‌కు ఈ భారీ పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

'అమెరికా ఫస్ట్ రిఫైనింగ్' అనే సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రిఫైనరీగా నిలుస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో (ఇరాన్ యుద్ధం నేపథ్యంలో) చమురు సరఫరాకు ఆటంకాలు కలుగుతున్న సమయంలో, ఈ కొత్త రిఫైనరీ అమెరికా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, వేలాది మందికి కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందని ఆయన చెప్పారు.

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని (జామ్‌నగర్) నిర్వహిస్తోంది. ఇప్పుడు అమెరికాలో నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టులో రిలయన్స్ భాగస్వామ్యం కావడం ద్వారా ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పన్నుల తగ్గింపు, అనుమతుల సరళీకరణ వల్లే ఇలాంటి భారీ పెట్టుబడులు అమెరికాకు తిరిగి వస్తున్నాయని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Donald Trump
Reliance Industries
US oil refinery
America First Refining
Mukesh Ambani
Texas
Brownsville Port
US energy sector
India US relations
oil and gas

More Telugu News